What is going to happen on Tuesday? What do Trump’s abusive remarks about Iran
What is going to happen on Tuesday? What do Trump’s abusive remarks about Iran
అయితే ఈసారి మరింత తీవ్రత పెంచిన ట్రంప్.. బూతులతో ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. ఈ ట్వీట్ ప్రస్తుతం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ట్రంప్‌లో అసహనం పెరిగి, ఇలాంటి ట్వీట్ చేసుంటారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్‌కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ట్రంప్ బూతులతో ఇరాన్ మీద విరుచుకుపడ్డారు. శాంతి ఒప్పందమో లేదా హర్మూజ్ జలసంధి తెరవడమో, ఏదో ఒకటి తేల్చుకోవాలంటూ ట్రంప్.. ఇరాన్‍కు 48 గంటల డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగుస్తున్న తరుణంలో ట్రంప్ మరోసారి ఇరాన్‌ను హెచ్చరించారు. అయితే ఈసారి ఆయన ట్వీట్‌లో బూతు పదాలను ఉపయోగించటం ప్రాధాన్యం సంతరించుకుంది. హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలన్న ట్రంప్.. లేదంటే మంగళవారం రోజున ఇరాన్‌లోని విద్యుత్ ప్లాంట్లు, వంతెనలే లక్ష్యంగా దాడులు చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు .ఈ విషయాన్ని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేసిన ట్రంప్.. ఇరాన్‌పై బూతు పదాలతో మండిపడ్డారు.
గల్ఫ్ దేశాల్లోని ఆర్థిక, మౌలిక సదుపాయాలను టార్గెట్‌గా చేసుకుని ఇరాన్ దాడులు కొనసాగిస్తూ, అమెరికా హెచ్చరికలపై ఖాతరు చేయకుండా ఏ మాత్రం వెనక్కి తగ్గని పరిస్థితులలో.. ట్రంప్ చేసిన పోస్టు ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అమెరికాకు చెందిన F-15E స్ట్రెక్ ఈగల్ ఫైటర్ జెట్ ఇరాన్‌లో కూలిపోవటం, గల్లంతైన పైలెట్ కోసం అమెరికా రెస్క్యూ ఆపరేషన్, పైలెట్‌ను కాపాడిన పరిణామాల అనంతరం.. ట్రంప్ ఈ పోస్టు చేశారు. అయితే ఇరాన్‌తో యుద్ధాన్ని ఆరు రోజుల్లోగా ముగిస్తామంటూ తొలుత చెప్పిన ట్రంప్.. ఇరాన్ ఏ మాత్రం వెనకకు తగ్గని నేపథ్యంలో అసహనంతో ఈ పోస్టు చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవైపు శుక్రవారం ఎఫ్-15ఈ స్ట్రైక్ ఈగిల్ కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత గల్లంతైన పైలెట్ కోసం గాలింపు చేపట్టిన అమెరికా దళాలు.. అతన్ని రక్షించాయి. అయితే అతను గాయపడ్డాడని.. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. తమ పైలెట్‌ను ఇరాన్‌లోని పర్వత ప్రాంతాల వద్ద నుంచి రక్షించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇందుకోసం పగటిపూటే సుమారు ఏడు గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించినట్లు తెలిపారు.
మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భద్రతామండలిలో రష్యాతో కలిసి పనిచేస్తామని చైనా ప్రకటించింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను తగ్గించడంలో సహాయపడటానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యాతో సమన్వయం కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి తెలిపారు. ఆదివారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో ఫోన్‌లో మాట్లాడిన వాంగ్ యి.. ఈ విషయాన్ని తెలిపారు.
హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకల కోసం వీలైనంత త్వరగా కాల్పుల విరమణ సాధించడం కీలకమని అభిప్రాయపడ్డారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా జరిగే రాజకీయ పరిష్కారాలకు చైనా మద్దతు ఉంటుందన్నారు. బహ్రెయిన్ తీర్మానంపై వచ్చే వారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

Comments
No comments yet. Be the first to comment.
Your Comment