బీఆర్ఎస్ మధ్య నడుస్తున్నది ‘ఫిక్సింగ్ పాలిటిక్స్’: బిజెపి అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేయడానికి పరస్పర అవగాహనతో ‘రాజకీయ నాటకాలు’ ఆడుతున్నాయని బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ఒకేరోజు జిల్లాల్లో పోటాపోటీగా భారీ సభలు నిర్వహించడం యాదృచ్ఛికం కాదని, ఇది ముందే రాసుకున్న స్క్రిప్ట్ అని విమర్శించారు. ఉత్తర తెలంగాణలో బిజెపి బలంగా ఎదుగుతుండటాన్ని జీర్ణించుకోలేక, ఆ ప్రభంజనాన్ని అడ్డుకోవడానికే ఈ ఇద్దరు నేతలు ఒక్కటయ్యారని ఆయన ఆరోపించారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ తీరుపై సుభాష్ తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి పదవి పోయి 26 నెలలైనా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా, ప్రతిపక్ష నేతగా కనీసం అసెంబ్లీకి కూడా సరిగ్గా రావడం లేదని మండిపడ్డారు. ప్రజల సమస్యలపై గళమెత్తకుండా, కేవలం పార్టీ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల నాయకులను చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతుంటే వారిని పట్టించుకోకుండా, జగిత్యాల పర్యటన పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. కేబినెట్ స్థాయి సౌకర్యాలు, కోట్ల రూపాయల జీతభత్యాలు తీసుకుంటున్న కేసీఆర్.. ప్రజా సమస్యలను విస్మరించి కేవలం సంతకాలు పెట్టడానికే నామమాత్రంగా అడపాదడపా అసెంబ్లీకి వస్తున్నారని విమర్శించారు.
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరును కూడా సుభాష్ తప్పుబట్టారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద అవినీతి ప్రాజెక్టు అని విమర్శించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి, ఇప్పుడు కేవలం 9వేల కోట్ల చిన్న అంశంపై సీబీఐ విచారణకు కోరుతూ అసలు అవినీతిని కప్పిపుచ్చుతున్నారని ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పినట్లు సిబీఐ విచారణకు పూర్తిస్థాయిలో అనుమతి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని, కాంగ్రెస్-బీఆర్ఎస్ ఒకరినొకరు కాపాడుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా, క్షేత్రస్థాయిలో ‘పొలిటికల్ టూరిజం’ తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఒక్కో పర్యటనకు సుమారు 25 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని, ఆ డబ్బు రైతులకు ఇస్తే మేలు జరిగేదని సూచించారు.
కాంగ్రెస్ సర్కారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను గాలికి వదిలేసి, ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎన్.వి.సుభాష్ దుయ్యబట్టారు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేల ఆలయాలను అభివృద్ధి చేస్తుంటే, తెలంగాణలో ఐదు ఆలయాలనైనా రేవంత్ ప్రభుత్వం పట్టించుకుందా అని ప్రశ్నించారు.
ముఖ్యంగా, మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ, ఇండీకూటమి దేశంలోని మహిళల హక్కులను కాలరాశాయని సుభాష్ ఆరోపించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళా బిల్లును మోదీ ప్రభుత్వం చారిత్రాత్మక రీతిలో తీసుకువస్తే, కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు కేవలం రాజకీయ లబ్ధి కోసం అడ్డుకున్నాయని విమర్శించారు. మహిళా సాధికారత పట్ల ఈ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో దేశ ప్రజలు గమనించారన్నారు.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య పెరిగి యువత భవిష్యత్తు నాశనమవుతున్నా, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. దోచుకోవడం-దాచుకోవడం-పంచుకోవడం అనే పద్ధతిలో సాగుతున్న కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల ‘ఫిక్సింగ్ పాలిటిక్స్’ ను ప్రజలు గమనించాలని, బిజెపి ఎప్పుడూ ప్రజా పక్షాన పోరాడుతుందని ఈ సందర్భంగా ఎన్.వి.సుభాష్ స్పష్టం చేశారు.

వ్యాఖ్యలు
ఇంకా వ్యాఖ్యలు లేవు. మొదటి వ్యాఖ్య మీరే రాయండి.
మీ వ్యాఖ్య